Sunday, 6 December 2020

కార్తీక పురాణం-30

త్రింశాధ్యాయము:-
పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని, శౌనకాది ఋషులు - 'మహాభాగా! కలియుగ కల్మషగతులు, రాగాదిపాశయుక్త సమపారగ్రస్తులూ అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది? అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది? దేవతలందరిలోకీ దేవాదిదేవుడెవరు? దేని వల్ల మోక్షం కలుగుతుంది? మోహము దేనివలన నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు మందులూ అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటీ, అని అడిగారు. అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు - 'మంచి ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్ధ క్షేత్రాటనా స్నానాల వల్లా - వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్లా కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. 

ఇంతవరకూ నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణ్వానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమధర్మము. సర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్దుడినీ గాను - సమయమూ చాలదు. గనుక - అన్ని శాస్త్రాలలోనూ వున్న - సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణుభక్తి కన్న తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగతపాపులై, నరకదూరులై వుంటారు - హరి ప్రీత్యర్ధులుగా స్నాన, దాన, జప, పూజా, దీపారాధనాదులను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలై పోతాయి. సూర్యుడు తులారాశి యందుండే నెలరోజులూ కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించేవాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతమును చేయని వాళ్ళు - కుల, మత, వయో, లింగభేద రహితంగా -  

అంధతామిత్రము' అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడుదురు. విష్ణులోకాన్ని చేరుదురు. కార్తీక స్నానమును చేసి, విష్ణ్వర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యిసార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్ఠము, హరిప్రీతిదాయకమూ, పుణ్యకరమూ అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో వుండగా, - కార్తీక, స్నాన, దాన, జప పూజాదులు చేసే వాళ్లు - సర్వదుఃఖ విముక్తులై - మోక్షమును పొందుతారు.


 దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధానం. ధన-ఫల-ధాన్య-గృహాది దానాలూ అమిత పుణ్యఫలదాలు. కార్తీకం ముప్పయి రోజులూ కార్తీక మహాత్మ్యాన్ని వినినా - పారాయణం చేసినా కూడా - సకలపాపాలూ? నశించిపోతాయి. సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములౌతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ గూడా కలుగుతాయి.



ఏవం శ్రీ స్కాంద పురాణా౦తర్గత కార్తీక మహాత్మ్యేమందలి

తింశాధ్యాయః సమాప్తః (ముప్పదియవ అధ్యాయము)


కార్తీక పురాణం సంపూర్ణం 🙏🙏🙏.........

భక్తులు పరమ భక్తితో ఈ కార్తీక పురాణం అధ్యాయంలు పారాయణ చేసినచో శాశ్వత శివ సాన్నిధ్య ప్రాప్తి కలుగను. ఈ కార్తీక మాసం పరమపవిత్రమైనది. హరిహరులకు ఏ మాత్రం కూడా అభేద్యం లేదని చెప్పిన మాసం .....

హరహర మహదేవ శంభో శంకరా


No comments:

భోగి

                                       🌾🌻🌞  భోగి 🌞🌻🌾 ‣ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండు...