ఆగు! ఓ విష్ణుచక్రమా, ఈ బ్రాహ్మణవధ నీకు తగదు. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధనికైనా సరే నేను సిద్ధముగానే వున్నాను. రాజులకి యుద్ధమే ధర్మముగాని, యాచన చేయడం ధర్మము కాదు. విష్ణ్వాయుథానివైన నీవు నాకు దైవస్వరూపానివే. గనుక నిన్ను ప్రార్ధించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్ధం నేను నిన్ను యేదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియును. అయినా, నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరికొన్నాళ్లపాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి వుండదలచుకుంటే శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్లిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను. అని క్షాత్రధర్మపాలనకై, తనకీ దూర్వాసునికీ మధ్య ధనుర్ధారియై నిలబడిన అంబరీషుణ్ని ఆప్యాయంగా చూసి, అతని ధర్మనిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది. 'అంబారీషా! నాతో యుద్దమంటే సంబరమనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటభుల్నీ - దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్నీ అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా, సమస్త ప్రపంచమూ కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తియైన ఈ దూర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే - అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతూండగా, కేవలము క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు. నువ్వు నన్నేం చెయ్యగలవు? క్షేమం కోరుకునే వాడు బలవంతుడితో సంధి చేసుకోవాలేగాని, ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకూ నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి, వృథాగా ప్రాణాలను పోగొట్టుకోకు.' ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి.
ఏమిటి సుదర్శనా? ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నానుగాని, లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి వుండే వాణ్ని. దేవబ్రాహ్మణులైనా, స్త్రీలూ - శిశువుల మీదా, ఆవుల మీదా నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష - ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి (క్షాత్ర) ధర్మయుతంగా పురుషరూపుడివై యుద్ధము చెయ్యి' అంటూ - ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికీ, ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికీ సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసమును చేస్తూ - 'రాజా! శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకలా ప్రసంగించానే గాని, విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుణ్ని వదిలేస్తున్నా'నని చెప్పి, అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై - 'సుదర్శనా! నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించడంలోనూ, విష్ణుతుల్య ప్రకాశమానమూ ప్రాణప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు' అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు, అంబరీషుని లేవనెత్తి అభినందించి, దీవించి, అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా, విన్నా - అనేక భోగాలను అనుభవించి - అంత్యాన ఉత్తమగతులను పొందుతారు.
No comments:
Post a Comment