ధ్వావింశాధ్యాయము
రెండవనాటి యుద్ధము - పురజయుని విజయము:
అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు: అగస్త్యా! ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో - పురంజయుడు తక్షణమే విష్ణ్వాలయానికి వెళ్ళి, వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి - ప్రదక్షిణ నమస్కారాలర్పించి - మేళతాళాలతో ఆయనను కీర్తించి, పారవశ్యంతో నర్తించాడు. అంతే కాదు. బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైన పురంజయుడు - మరుసటి రోజు ఉదయమే శేషసైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ - భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు. ఈ ఠంకారం చెవినబడిన - కాంభోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ, పిడుగుల వంటి బాణాలతోనూ, అమిత వేగవంతాలూ ఆకాశానికి సైతం ఎగరగలిగినవీ అయిన గుర్రాలతోనూ, ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బాలతోనూ - క్రమక్రమంగా యుద్ధం దారనిరీక్ష్యమానంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు - అతనికి దైవబలాన్ని తోడుచేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి.
కాంభోజుల గుఱ్ఱాలు, కుఱజాదుల ఏనుగులు, వివిధరాజుల రథబలాలూ, వైరి కూటం యొక్క పదాతి బలాలు - దైవకృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ - ప్రాణభీతితో రణరంగాన్ని వదలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో - విష్ణ్వనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు - అయోధ్యా ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రువడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రాత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో - వారి సమస్త దుఃఖాలూ కూడా చిటికెలమీదనే చిమిడిపోతాయి. అగస్త్యా! విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందునా కార్తీకవ్రతాచరణసక్తీ - శక్తీ కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరితే కార్తీక వ్రతమూ, శ్రీహరిసేవా వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే - వైష్ణవోత్వములుగా పరిగణింపబడతారు. వేదవిధులైన బ్రహ్మణులైనప్పటికీ కూడా - ఈ హరిసేవా, కార్తీక వ్రతాచరణలు లేనివాళ్లు కర్మచండాలులేనని గుర్తింపు.
ఇక వేదవేత్తయై, హరిభక్తుడై, కార్తీక వ్రాతనిష్ఠుడైన, వాణి యందు సాక్షాత్తూ ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతివాళ్లయినా సరే ఈ సంసార సాగరాన్నుంచి బైటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే - తక్షణమే వాళ్లు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్త్యా! స్వతంత్రుడు గానీ, పరతంత్రుడు గానీ - హరి పూజాసక్తుడై వుంటేనే ముక్తి. భక్తులకా శ్రీహరీ, విష్ణువుకీ భక్తులూ అన్యోన్యానురాగబద్ధులై వుంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి, రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండివున్న ఆ విష్ణువునందు భక్తి ప్రవత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి, వేదసమ్మతమూ, సకలశాస్త్రసారము, గోప్యమూ, సర్వవ్రతోత్తమోత్తమమూ అయినా ఈ కార్తీకవ్రతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్పూర్తిగా విన్నా కూడా - వాళ్లు విగత పాపులై - అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్త్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన - పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా!
ఏవం శ్రీస్కాంద పురాణాంతారగా కార్తీక మహాత్మ్యే
ధ్వావింశాధ్యాయము సంపూర్ణం
No comments:
Post a Comment