Sunday, 6 December 2020

కార్తీక పురాణం-26

షడ్వింశాధ్యాయము:- 

ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు - సంభవిత లోకాలన్నీ సంచరించి, చిట్టచివరగా - చక్రపాణియైన విష్ణువులోకాన్ని చేరాడు. 'హే బ్రహ్మణప్రియా! మాధవా! మధుసూదనా! కోటి సూర్యులతో సమానమైన కాంతిని - వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ వుంది. బ్రాహ్మణపాదముద్రా సుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్నీ ఆపదనుంచి కాపాడాలి' అని ఘోషిస్తూ - సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. 'దూర్వాసా! ప్రపంచానికి నేను దైవాన్నయినా - నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కాని, నువ్వు సద్బ్రాహ్మణుడవూ, రుద్రాంశ సంభూతుడవూ అయి వుండిగూడా - అంబరీషుణ్ణి అకారణముగా శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానార్ధమై వెళ్ళిన నువ్వు - సకాలానికి చేరుకోలేదు - ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురుచూడకుండా, ద్వాదశీఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఈయలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్నిక్షణాలు మాత్రమే వ్యవధివున్న సమయంలో - వ్రత భంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో - నిన్నవమానించాలనో కాదు. 'అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా' - నిషిద్దాహారులకు కూడా, జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూండగా, అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయా! నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమనీ వేడుకున్నాడేగాని, కోపగించుకోలేదు గదా! అయినా సరే, ముముక్షువైన అతగాడిని నువ్వు - పది దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడంకోసం నీ శాపాన్నీ నిమిషంలో త్రిప్పివేయగలను. కాని, బ్రాహ్మణవాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము. నీకు కలగకుండా ఉండడం కోసం - ఆ భక్తుని హృదయములో చేరి, నీ శాపాన్ని సవినయంగా స్వీకరించినవాడినీ, నీ శాపాన్ని అంగీకరిస్తూ 'గృహ్ణామి' అన్నవాడినీ నేనేగాని, ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు.

ఋషిప్రభూ! నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకూ, శిష్యుడైన మనువునుద్ధరించేందుకూ మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించేవేళ, మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా వుండేందుకుగాను కూర్మావతారుడ (తాబేలు) నవుతాను. భూమిని ఉద్దరించేందుకూ, హరిణ్యాక్షుణ్ణి చంపేందుకూ, వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల 'నరసింహ' రూపావతార దారుడినవుతాను. సర్వదేవతా సంరక్షణకోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక 'బలి' అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్ళగొడతాను. రావణ సంహారార్ధమై ఆత్మజ్ఞానశూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన - మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానినీ, బలవంతుడను అయి వుండీ కూడా - రాజ్యాధికారం లేకుండా రాజు (బలరాముడు)కు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలుయుగారంభాన పాపమోహము కొరకు పాషండమత ప్రచారకూడనై బుద్దుడనే పేరున పుడతాను. ఆ యాగంతన శత్రుఘాతుకుడైన - బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను, దుర్వాసా! నా యీ దశావతారాలనూ - ఆయా అవతారాలలోని లీలలనూ ఎవరు వినినా, చదివినా తెలుసుకున్నా - వారి పాపాలు పటాపంచలవుతాయి.



శ్లో|| ధర్మానానా విధా వేదే విస్తృతా వరజన్మనాం
దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశః ||



దేశ, కాల, వయో 2అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను ననుసరించీ - 'ధర్మము' అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి వుంది. అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా 'ఏకాదశి' నాడుపవాసం. ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను - నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక, తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడమూ - భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడమూ రెండూ నా బాధ్యతలే గనక - పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను.

     

ఏవం శ్రీ స్కాంద పురాణంతర్గత కార్తీక మాహత్మ్యేషడ్వింషాధ్యాయ: సమాప్త:


No comments:

భోగి

                                       🌾🌻🌞  భోగి 🌞🌻🌾 ‣ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండు...