ఏకాదశాధ్యాయము
వసిష్ఠ ఉవాచ : ఓ మహారాజా! కార్తీకమాసములో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణఫలము కలుగుతుంది. గరికతోనూ, కుశులతోనూ పూజించే వాళ్ళు పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణుసన్నిధిని దీపమాలికను నుంచేవాళ్ళూ, వైకుంఠ పురాణ పాతకులూ, శ్రోతలు కూడా విగతపావులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలనూ సమయింపచేసేదీ __ ఆయురారోగ్య దాయినీ __ అయిన ఒక కథను వినిపిస్తాను విను.
మందరోపాఖ్యానము:
కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానోక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నీటినీ విసర్జించి, పరులకు కూలిపని చేస్తూ వుండేవాడు. అతనికి పతిమిత్ర, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్నా, సద్గుణ సముచ్చయము చేత 'సుశీల' అని పిలువబడే భార్య వుండేది. భర్త యెంత దుర్మార్గుడైనా కూడా, అతనియందు రాగమే తప్ప ద్వేషము లేనిదై, పాతివ్రత్య నిష్టాపరురాలయి వుండేది. కొన్నాళ్ళ తరువాత, కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై, ఖడ్గపాణియై- దారులుకాసి బాటసారులను కొట్టి _ వారినుండి ధనము నపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసికొనిపోయి, అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబ పోషణచేసేవాడు.
ఒకసారి - దొంగతనానికై దారికాసి వున్న మంధరుడు - బాటసారియైన ఒకానొక బ్రాహ్మణునిని పట్టుకుని _ అక్కడి మర్రిచెట్టుకు కట్టివేసి - ఆ బాపని ద్రవ్యాన్నంతనూ అపహరింపచేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక కిరాతకుడు _ దోచుకొనిన మంధరుడినీ, దోచుకోబడి బంధితుడై వున్న బ్రాహ్మణనినీ యిద్దరినీ కూడా చంపివేసి, ఆ ద్రవ్యాన్ని తాను హరించుకు పోబోయాడు. కాని, అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి - కిరాతకునిపై బడింది. పులి తన పంజాతోనూ, కిరాతకుడు ఖడ్గ౦తోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగదంలో పులీ, కిరతకుడూ కూడా యేకకాలంలోమరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మంధర వ్యాఘ్ర , కిరాతకుల జీవులు నలుగురూ యమలోకమును చేరి, కాలమాత్రమునే నరకాన్ని పొందారు. యమకింకురులా ఆ నలుగురినీ _ పురుగులూ, ఆమేథ్యమూతో నిండివున్న తప్త రక్తకూపంలో పడవేశాడు
ఇక భూలోకములో, భర్త మరణవార్త తెలియని మంధరుని భార్యయైన సుశీల మాత్రము నిత్యం భర్తృధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జనసాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు - నిరంతర హరినామ సంకీర్తనా తత్సరుడు, సర్వులయందునా భగవంతుని. దర్శించువాడూ, నిత్యానంద నర్తనుడూ అయిన ఒకానొక యతీశ్వరుడు _ ఈ సుశీల యింటికి వచ్చాడు. ఆమె శ్రద్దా భక్తులతో అతనికి భిక్షవేసి 'అయ్యా! నా భర్త కార్యార్దియై వెళ్ళి వున్నాడు. ఇంటలేడు. నేనేకాకినై అయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను' అని విన్నవించుకుంది. అందులకా యతి 'అమ్మాయీ! ఆవేదనపడకు. ఇది కార్తీక పూర్ణమా మహాపర్వదినము. ఈ రోజు సాయంకాలము నీయింట పురాణ పఠమాశ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనై నా దగ్గరవుంది. నీవు వత్తిని _ ప్రమిదను సమర్పించినట్ట్లేయితే _ దీపమును వెలిగించవచ్చును' అని సలహా యిచ్చాడు.
ఆ యటిశ్రేష్టుని మాటలనంగీకరించి సుశీల - తక్షణమే గోమయముతో యిల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రత్తిని పరిశుభ్రపరిచి, రెండు వత్తులను చేసి, యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి, ఆ దీప సహితముగా విష్ణువును పూజించి - మనశ్శుద్ది కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల యిండ్లకు వెళ్ళి, వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమా తాను కూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులనందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమ క్రమముగా ఆమె జ్ఞానియై, తదుపరిని కాలధర్మమును చెందినది.
తత్ క్షణమే శరఖ చక్రాంకితులు, చతుర్భాహులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు_ నందనవన, సుందర మందారాది సుమాలతోనూ, రత్నమౌక్తిక ప్రవాళాదూలతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై వున్న దివ్య విమానాన్ని తెచ్చి _ సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల, మార్గమధ్యమములో నరకములో మరిముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూన్న తన భర్తను గుర్తించి, విమానాన్ని ఆపించి _ తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషుదులను కోరింది. అందుకు వారు 'అమ్మా! నీ భర్తయైన ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి - కూలియై, మరికొన్నాళ్ళు దొంగయై - దుర్మార్గ ప్రవర్తన వలన యిలా నరకాన్ని అనుభవింస్తున్నాడు. అతనితోబాటే వున్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మిత్రుడొకనిని చంపి - అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకుగాను అతడు నరకము పొందాడు. మూడవవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రహ్మణునినీ, నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను యితడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి అతఃపూర్వజన్మలో ద్రావిడ బ్రహ్మణుడై యుండి - ద్వాదశినాడు భక్షాభక్ష్య విచక్షణా రహితుడై ఆచరించిన తైలాదికభోజనాదుల వలన నరకమును పొంది _ పులిగా పుట్టి _ ఈ కిరాతుకుని తోడి జగడములో అతనితోబాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకూ కారణాలివే తల్లీ !" అని చెప్పారు.
ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి _ ఏపుణ్యము చేసినట్లయితే వాళ్ళకా నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా, వైష్ణువులు కార్తీకమాసములో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితానని ధారబోయడము వలన నీ భర్తా _ పురాణ శ్రవణార్దమై నువ్వు యింటింటికీ వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారాబోయడము వలన మిత్ర ద్రోహియైన ఆ బ్రాహ్మణుడు _ ఆ పురాణ శ్రవణార్దమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చేరిసగముగా ధారపోయడము వలన కిరాత వ్యాఘ్రాలూ నరకము నుంచి ముక్తిని పొందుతారు." అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడువుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడముతో - ఆ నలుగురూ నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశింసిస్తూ - మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా! కార్తీకమాసములో చేసే పురాణశ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో.
ఏకాదశోధ్యాయ స్సమాప్త: (పదకొండవ అధ్యాయము)
No comments:
Post a Comment