Sunday, 25 October 2020

కురుక్షేత్రం

....... యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు భంగమైన ఊరువులతో తన మృత్యువుకై ఎదురుచూస్తున్నాడు. పాండవులు దుర్యోధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గదాయుద్ధాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

              కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రథాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో ఉప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి, "బావా చూసావా  కౌరవులు ఎలా నశించారో?"  అని అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు.

       అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ,కర్ణాది మహావీరులూ, శత్రువులంతా ఎలా తన అస్త్రశస్త్రాలకి బలైంది తనకళ్ళకు కనపడినది. తను జయించాడు...కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన మేటి విలుకాడే ఈ భూమి మీదే లేకుండాపోయాడు.

        అన్ని రథాలు రణరంగం మధ్యలో ఉన్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క ఉదుటన రథం కిందకు దూకి - "పితామహా.. పితామహా.. మేము జయించాం... కౌరవులందరూ నిహతులైనారు.." అన్నాడు. భీష్ముడు దుఃఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.
"అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా.." అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు. అవును పితామహా... సుయోధనుడి ఊరువులను ఇప్పుడే భంగపరిచాను. గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది.."

"కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట"

"అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి.." అని నకులుడన్నాడు. నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా అని సహదేవుడాన్నాడు.

భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు. "అర్జునా..." పిలిచాడాయన నెమ్మదిగా.

"చెప్పండి పితామహా.."

"నీవేమి చెప్పవేం..??"

"చెప్పేదేముంది పితామహా... నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను,కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను. ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము."

"మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?" ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి గంగాతనయునికి నమస్కరించాడు.

"పరంధామా...... నేవెందుకయ్యా     నమస్కరిస్తావు. ధర్మపక్షపాతివై ధర్మం పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదేకదా ముకుందా... నీకే మేమంతా నమస్కరించాలి."

      ఆ మాటలువింటూనే అర్జునిడికి ఎక్కడలేనికోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు. యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు కానీ నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత అని మనసులో అనుకున్నాడు.

        అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రథాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారథి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రథం పైన ఉన్న ధ్వజం వైపు చూసాడు. ఝండా పై ఉన్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రథంముందు వినయంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు.
 
          "శ్రీరామచంద్రా... వాసుదేవా.. పరంథామా నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా  పార్ధుడి రథంపై ధ్వజమై నిలిపి నీవు లోకానికి ప్రసాదించిన భగవద్గీతాసారం  విని నీ విశ్వరూప సందర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా.." అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రథంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రథంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.

         అంతే... ఫెళ ఫెళ మంటూ శబ్దం చేస్తూ రధం కుప్పకూలిపోయింది. రథచక్రాలు తునాతునకలయ్యాయి. రథాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపితులై చూస్తుండగానే రథం అశ్వాలతో సహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు "అర్జునా అర్జునా" ఏమైంది అంటూ పరుగు పరుగున వచ్చాడు.

అర్జునుడు కూడా భయపడుతూ "బావా వాసుదేవా" అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. "నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది.." అన్నాడు ఖంగారుగా.
ఆ మాటలు వింటునే కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.

"ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా.." అన్నాడు అర్జునుడు. హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు -"పార్థా నవ్వక ఏమి చెయ్యమంటావు. నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరమార్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది."

"బావ నన్ను కాపాడాడా.?"

"అవును అర్జునా... ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు... భీష్ముని బాణ ధాటికి నీ రథ చక్రాలు ఏనాడో కూలాయి. కర్ణుని అస్త్రా లకి నీ అశ్వాలు ఎప్పుడో మరణించాయి. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రథం అప్పుడే తునాతునకలయ్యింది. బ్రహ్మాస్త్రం ధాటికి నీ రథం యావత్తూ బూడిదయ్యింది."

"మరి..?"

"నీ రథం పైన సాక్షాత్తు ఆది విష్ణువే ఉన్నాడు. ఆ పరమాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు వాసుదేవుడు రథంనుండి కిందికి దిగడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రథం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా! అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంథాముణ్ణి దాటి రావాలి కాబట్టి.."

హనుమంతుడు ఈ మాటలనగానే పాండవులకు తమ అజ్ఞానం ఏమిటో బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడికి ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.

"పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి.." అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.
శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.... 🙏🙏🙏

Saturday, 24 October 2020

సత్యం

...........ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి
రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి
వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణెం ఒకటి
అతడి కంట పడింది. వంగి, చేతుల్లోకి తీసుకున్నాడు.
కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు.
ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర
ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు ఆ నాణెం వల్ల కొత్తగా
వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు.
అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు.
దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు.
ఎవరూ కనిపించలేదు! చివికిన బట్టలతో కొందరు
ఎదురైనా వాళ్లూ సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ
చెయ్యి చాచడం లేదు. సాధువుకు సంతోషం వేసింది,
ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది.
ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి సాధువు
నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో
పక్కరాజ్యంపై దండెత్తందుకు వెళుతూ కనిపించాడు.
అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు
వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి
సాధువుకు నమస్కరించాడు. “ఓ సాధు పుంగవా, రాజ్య
విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను,నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి" అని కోరాడు.
సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో
పెట్టాడు. రాజు  ఆశ్చర్యపోయాడు. 'ఏమిటి దీనర్థం'
అన్నట్లు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి,
“ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు
దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం
ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను.
అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అంతా
సంతృప్తిగా కనిపించారు. ఉన్నదానితో సంతృప్తి
చెందకుండా,ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న
వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు
ఇచ్చాను" అని చెప్పాడు. రాజు అంతరార్థం గ్రహించాడు.
దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు.
*నిరంతరం లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే,*

*ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం.*
*ఆ భాగ్యం లేని వాడు, ఎంత ఉన్నా ఏమీ లేనివాడే!*

Friday, 23 October 2020

అతిథి మర్యాద

 రామాయణం నుండి మీకోసం ఒక చిన్న సారాంశం........... యుద్ధకాండలో విభీషణుడొచ్చి శరణువేడితే అందరూ వద్దంటున్నా..రాముడు శరణు ఇస్తూ దానికి ముందు ఇలా అన్నాడు...‘‘వాడు శత్రువే కానీ, మిత్రుడే కానీ –రామా ! నేను నీ వాడను– అని నన్ను శరణువేడితే రక్షిస్తా.  పురుషులే కానక్కరలేదు, ఎవరయినా....అది నా ప్రతిజ్ఞ. అంటూ...ఇంకా ఇలా చెప్పాడు..’’ 

‘‘ఓ చెట్టుమీద ఓపావురాల జంట తన పిల్లలతో సంతోషంగా కాలాన్ని గడుపుతుంది. ఒక రోజు వేటగాడు అటుగా వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఆ వేటగాడికి  బాగా ఆకలి వేసింది. వేటగాడు ఆ చెట్టుమీద ఉన్న పావురాల జంటను చూసాడు.

 అలా ఉండడాన్న  చూసిన వేటగాడు ముందు పిల్లల్ని నేలకూల్చాడు.  పిల్లలకోసం అలమటిస్తూ ఆడపావురం తిరుగుతూంటే దాన్ని కొట్టి పడేసాడు. మగపావురం కళ్లముందే ఆడపావురం రెక్కలు తెంపేసి, ఈకలు తీసి, దాని మాంసాన్ని కాల్చుకు తిన్నాడు. మగపావురం కన్నీరు పెట్టడం తప్ప ఏం చేయలేకపోయింది. కొన్నాళ్ళయిన తరువాత అదే వేటగాడు ఒకరోజు జోరుగా వాన కురుస్తుంటే అరణ్యంలో ఒక్క మృగం కూడా దొరక్క ఆకలితో నకనకలాడుతూ తిరిగి తిరిగి వచ్చి అదే చెట్టుకింద నిస్సత్తువతో చేరగిలబడ్డాడు.
అయ్యయ్యో, నా గూడున్న చెట్టుకింద ఆకలితో వచ్చి కూర్చున్నవాడు  నాకు అతిథి అవుతాడు. అని ఎండుపుల్లలు తెచ్చి అక్కడ నెగట్లో వేసి చలికి వణుకుతున్న అతనికి సేదదీర్చింది. ఇతని ఆకలి తీర్చగలిగే తిండి నేను తీసుకురాలేను. అందువల్ల నేనే అతనికి ఆహారమవుతానని ఆ అగ్నిహోత్రంలోకి దూకేసింది. తన భార్యను, తన బిడ్డల్ని చంపినవాడు కూడా అతిథిగా వచ్చేటప్పటికి ఒక పక్షి తాను పడిపోయి ఆహారమయి ఈ ఉపకారం చేసింది.     
మానవుడై ఉండి, గ్రృహస్థుడినై ఉండి ఒక సజ్జనుడు  నా దగ్గరకొచ్చి నిలబడి రక్షించమని అడిగితే...పావురం పాటి సాయం చేయనక్కరలేదా ...??? కాబట్టి నేను రక్షిస్తా. విభీషణుడిని స్వీకరిస్తున్నా’’ అని పలికిన రామచంద్ర ప్రభువు అతిథిపూజ అంటే ఏమిటో నేర్పాడు స్వామి. 
                                        జై శ్రీరాం !! 

Wednesday, 21 October 2020

Yama dharmam

...............యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు
భూలోకానికి వచ్చాడు ఆ దూత 
ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది 
అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు 
ఆ తల్లిని కూడా  చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలన ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు 

అదే విషయాన్నీ యమధర్మరాజుకు చెప్పగా 
దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు 

యమదూత పూర్తి నల్లని రూపంతో ఒక చోట మూలుగుతుండగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకు వెళ్తాడు 
తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టుమిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తాడు 

యమదూతను తీసుకెళ్లి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు 
తాను తాగేందుకే గంజి లేదు అతిథికి విందుభోజనమా 
అన్నం లేదు ఏమీ లేదు వేళ్ళు అంటుంది 
యమదూత అక్కడనుండి వెళ్లిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలి రా వచ్చి బోంచేయి అంటది 
అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు 
అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది 

ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పని చేస్తూ ఇక్కడే ఉండొచ్చు అంటాడు అలా ఐదేళ్లు గడిచాక ఆ ఇంటిముందు ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది 
ఆ ఇద్దరి పిల్లలలో ఒకడు అవిటివాడు 
కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా 
 చాలా ఖరీధైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది 
అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత 
మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది 

మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో  వచ్చి చాలా విలువచేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్లకు చినిగిపోని సూట్ ఒకటి కుట్టమని మూడురోజుల్లో వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తాడు 

 రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవర్ మరియు ఒక దుప్పటిలా కుట్టేస్తాడు అది చూసిన ఆ దర్జీ అయ్యో ఎంత పని చేసావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమీ చెప్పాలి అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు దిండు కవర్ దుప్పటి కుట్టివమని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోతాడు 

అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్లిపోతుండగా అప్పుడు దర్జీ అయ్యా మీరెవరు 
మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి మూడు సార్లు మాత్రమే నవ్వారు మీరు నవ్వినప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి అన్నాడు 

జరిగిన విషయం చెప్పి 
మొదటి సారి 
మీ భార్య అన్నం లేదు అని చెప్పింది 
అప్పుడు ఆమె దరిద్రదేవతలాగా కనిపించింది 
మళ్ళీ బోంచేయి అని పిలిచినప్పుడు 
నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది 
అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని 

రెండవ సారి 
ఆ పిల్లాడు తల్లి ప్రాణాలను తీయమన్నపుడు అలోచించి వదిలేసాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా తన బిడ్డకు సమానంగా చూసే వ్యక్తి దగ్గర చేసాడు 
అప్పుడు అర్థం అయింది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండ భర్తీ చేస్తాడు అని 

ఇక మూడోసారి 
అతడు మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్లకు చినిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు 
మనం శాశ్వతం కాదు 
ఏ క్షణాన ఎవరూ పోతామో తెలియదు ఎంత కాలం ఉంటామో తెలియదు  కానీ నమ్మకం 
ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగుచేసేస్తుంటారు 
అక్రమంగా సంపాదించి చెర్చేస్తుంటారు 
ఆశతో బతికేస్తుంటారు అని చెప్పి దేవరహస్యాలను తెలుసుకున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు........

Sunday, 18 October 2020

గజేంద్రమోక్షం 😊

..........ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం".

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం 

పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.  
జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!
తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి. 
గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను  శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి,  ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనేజ్ఞానముతో అజ్ఞానఅహంభావనను సంహరించిన పిదప  ఆత్మసాక్షాత్కారం అవుతుంది.  
జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి. 
'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం. 
ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప
 ఆధ్యాత్మిక ప్రబోధం... ఓం నమో నారాయనాయ.. 🙏🙏🙏

సాధువు- జీవితం


ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు.. ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.

సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని.
మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ యజమాని.,
"ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ.. మీజీవితమే
హాయి !! అన్నాడు
వెంటనే ఆ సాధువు "అయితే నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.
యజమాని కంగారుపడుతూ.
"అలా ఎలా కుదురుతుంది??
పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!"
అన్నాడు.
సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు. మాటలలో సాధువు అన్నాడు, 
"పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను"..
యజమాని తడబడుతూ 
"ఇప్పుడే కాదు స్వామీ! పిల్లలు స్థిరపడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి.." అన్నాడు.
ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. 
సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం.. సాధువు అదే మాట.. యజమాని జవాబు కొంచెం విసుగ్గా..
"పిల్లలకి డబ్బు విలువ తెలియదు, అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను.. వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది" అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు.
అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది. ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది సాధువు అనుమానంగా దాని వంక చూశాడు..
సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు.. అని
సాధువు మంత్ర జలం దాని మీద జల్లి, "ఏమిటి నీ
పిచ్చి మోహం ??? 
కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? 
నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను" అన్నాడు.. యజమాని..
"ఆ మాట మాత్రం వినలేను.. ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.

మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు , కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు. అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ ఆ పాముగా పుట్టిన యజమాణిపై మంత్రజలం చల్లి.,
"ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ??? 
ఇకనైనా నాతో రా మోక్షాన్ని మార్గం తెలియజేస్తాను" అన్నాడు.
ఆ యజమాని.,
"ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా.."
సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి, అతని కొడుకులతో 
"మీ నాన్న తను సంపాదించిన సొమ్ము అంతా ఆ చెట్టు కింద దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అన్నాడు.
అనగానే కొడుకులు ఎగిరి గంతేసి,, కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో
చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు
కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది..........

నీతి:
గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు
ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం. బంధాలు ముఖ్యనే కానీ మానవజీవిత అంతమం, పరమార్థం మోక్షమే. దాన్ని చేరే విధంగా మనం జీవనం సాగించాలి.

     🙏 🙏🙏

Thursday, 15 October 2020

Swami Vivekananda☺️


"స్వామి_వివేకానంద" జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన

....... ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది. వివేకానందుడు సన్యసించారు,కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు. భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు.

🌹 వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా , సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ , ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కిలిగి  స్వామీజీతో అతడిలా అన్నాడు.

🌹ఓ స్వామీ ... చూడు ... చూడు ... నేనెంత మంచి భోజనం చేస్తున్నానో.. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్లు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా ... ఏ సంపాదనా లేకుండా దేవుడు ... దేవుడూ... అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక తప్ప అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు. స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.

🌹అప్పుడు ఒక అద్బుతం జరిగింది ...

🌹ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు," మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహం.దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి" అని ప్రాధేయపడ్డాడు.

🌹స్వామీజీ ఎవరు నాయనా నీవు.. నేను నిన్ను ఎరుగనే... పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే.

🌹 శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.

🌹నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో... అదే అభయ హస్తమిది. 

🌹ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపై పడి,కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు. 

🌹తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ.  

🌹ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే , ఇంతకు మించినవి , ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి , భగవంతుని పట్ల , యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో .........

🌹ఓం శ్రీ గురుభ్యో నమః🌹

Wednesday, 14 October 2020

Shiv Parvathi ☺️

                              హే శివా……హే ఈశ్వరా…
                                  హే మహాదేవా…!!

ఓ ఆదిదేవా! నీవు సకలసృష్టి కర్తవురా!.....
అణువణువునా నిండి నిబిడీకృతమై ఉన్న వాడవురా…….
ఈ సకల చరాచర జగత్తుకు మూలానివి నీవే శివా!
ఆద్యంతాలు లేని ఏకైక జ్యోతిర్లింగానివి నీవే కదా తండ్రీ…….

ఓ వైరాగి! బంధాలకు అతీతమైన వాడా 
ఋణ విముక్తుడవు, వేదశాస్త్రాల నిధివీ నీవే 
అనాధివి నీవే బంధుత్వానివి నీవే శివా ….
సాకరనిరాకరానివి నీవే! సర్వం నీవే కదా పరమేశా!

ఓ గంగాధరా! పతిత పావనమైన గంగను ధరించువాడా….
భాగీరథి ప్రవాహ జలంచే పృధ్విని పరిరక్షించినవాడా …. 
లోకానికై జీవనాధారను ధరకు చేర్చినవడా….
వారణాసి పాపనాశినిని ప్రసాదించిన వాడవు…..
 నీవే కాశీ విశ్వనాధుడువి కదరా ఈశ్వరా! 

ఓ త్రిశూలధారి! భూత, భవిష్యత్, వర్తమనంకు ప్రతీకమైన శులపాణివి…
డమరుక ధ్వనిచే సమ్మోహించి శాంతపరిచేవాడ…..
క్రూర, అతి క్రూర దానవులను సంహరించినవాడ….
పరాక్రమ, జ్ఞాన చైతన్య ప్రకాశానివి నీవే కదరా పినాకపాణి!

ఓ గరళకంఠా! సాగరమధన హాలాహలంతకారి …
గరళమందు కాలకూటం ధరించువాడా ……
శ్వేత వర్ణఛాయ గల మేనిపై నీలిమచ్చ గలవాడా……
విషాన్ని ధారణ చేసి స్రృష్టిని రక్షించినవాడవు నీవే కదరా అమ్రృతమూర్తీ!

ఓ భోళాశంకరా! సనకాది బ్రహ్మాది మునీశ్వరులకు ప్రీతికరమైన వాడా…
దేవా, దానవ, మానవ ప్రియా ఈశ్వరా ….
భక్తి వలన తృప్తి చెందే అభిషేక ప్రియుడవు….
భక్తజన సంరక్షకుడివి నీవే కదరా వామదేవా!

ఓ నాగభూషణ!  సర్వ ప్రాణులు సమానమే అని చాటి చెప్పిన వాడా….
కంఠంలో సర్పం, తనువుపై విభూతి, మెడలో కపాలంతో విరాజిల్లు వాడా..
వ్యాఘ్ర చర్మధారివి నీవే…..
వస్తువుల పై ఆసక్తి లేనివాడవు నీవు కాక ఇంకెవరూ కపాలి!

ఓ అర్ధనారీశ్వర! ప్రకృతి, పురుషుడు ఒక్కటే అని వెలుగెత్తి చాటిన వాడా..
సతికి నీ తనువులో సగభాగం ఇచ్చిన వాడవు…..
“శక్తి లేని శివుడు శవంతో సమానం” అని భార్యను ప్రేమించిన వాడా….
నీకంటే ఉత్తమమైన పతి ఈ సకల చరాచర జగత్తులో ఉండగలరా పరమేశా!

ఓ శివ ప్రసన్న మూర్తి! వదనం పై చిరుమందహాసం కలవాడా…..
నిత్యం ప్రసన్నాక్షివై దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేవాడా…..
అమ్మతో కూడి ఆహ్లాదకరంగా ఉండే తండ్రివి నీవే కదా….
నిత్యం భక్తుల హృదయాల్లో అలలారే అఖండజ్యోతివి నీవేరా భక్తవత్సలా! 

ఓ ఉమాపతి! కైలసగిరిలో కొలువుండే తండ్రి ….
స్త్రీకి  గౌరవంలో మొట్టమొదటి స్థానం ప్రసాదించిన ఆదిదేవుడవు….
పార్వతీ ప్రాణ నాధుడవు! నీకు సాటిగా సతిని తీర్చిదిద్దిన వాడవు…..
శివపార్వతులు పరస్పర పూరకాలు అని చెప్పిన ఆది దంపతులు మీరే కదా శివశాంభవి! 

ఓం ఆదిభిక్షు! ‌అన్నపూర్ణ ( పార్వతీ) దగ్గర భిక్షం అర్ధించినవాడా….
నీకు తల్లి లేకపోయినా తల్లి ప్రేమను ఈ లోకానికి అందించిన వాడా …
 దయా, కరుణా,ప్రేమ అన్నీ ఉన్న అరూపరూపివి …..
ఇన్ని గుణాలు అపారంగా ఉన్న ఏకైక తేజోమూర్తివి నీవే కదరా అంబికానాథా!

అన్ని జన్మలో కన్నా ఉత్తమమైన జన్మను ప్రసాదించిన నీకు నేను ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి పరమేశ ……
నీకు  ఏమైనా సమర్పించాలి అన్న జిజ్ఞాస నాలో కలిగినప్పుడు….
1. జలంతో అభిషేకం చేయాలి అనే తలపు ….. నేనే గంగాధరుడిని!
2. దీపం వెలిగించే తలపు …. నేనే అగ్నిహోత్రుడుని!
3. చల్లని ప్రదేశంలో నీ ఆరాధన……నేనే చంద్రశేఖరుడిని!
4. ఏమైనా  వస్తువుని  సమర్పించాలి అని నాలో కలిగిన క్షణం ……కుబేరుడు సదా నీ చరణాల వద్ద అలలారుతు ఉంటాడు 
5. నీకు ఎంతో ప్రీతికరమైన విభూతి ……నీవే స్మశనవాసివి 
6. సంగీతం వినిపించాలి అనే నా మూర్ఖత్వం……. నీవే సంగీత సాహిత్యాలకు , నాట్య శాస్త్రానికి, వేదాల సారానివి ….. నటరాజువి
7. నీకు గుడి కట్టించాలి అనే ఆలోచన ……ఈ సకల సంసారం నీదే … 
8. పంచభూతాలకు అధిపతి నీవే , దశమహా విద్యలు నీవే……

ఇంక నేను నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి …..కేవలం భక్తితో నీవు ఇచ్చిన ఈ మనసును  నీ చరణాల వద్ద ఉంచి  ప్రణమిల్లగలను.  నేను నిన్ను అర్థిస్తున్నాను నాకు ముక్తిని ప్రసాదించి నీలో ఐక్యం చేసుకో తండ్రీ…….  శాశ్వత శివ సాన్నిధ్య ప్రాప్తిని కల్పించాలని వేడుకుంటున్నాను. శివలోక మహా ప్నోతి శివేన సహమోదతే!......
                                  శివుడు 
ఆదిదేవుడు, వైరగి, యోగి, చంద్రశేఖరుడు, గంగాధరుడు, పినాకపాణి, త్రిశూలధారి, లయకారుడు, ఉమాపతి,ప్రసన్న మూర్తి, గరళకంఠుడు, అర్ధనారీశ్వరుడు, త్రిపురాంతకుడు, పార్వతీ ప్రాణ వల్లభుడు, భోళాశంకరుడు………... సర్వం శివమయం జగత్ 
        కేవలం భక్తి వల్ల ప్రసన్నుడు ….. తనకు సమర్పించే అభిషేకాలు వద్దు అని  లేని వాళ్ళకి దానం చెయ్యమని చాటిన వాడు. అలా దానం చేసిన వారికి సదా ఆయన ఆశీర్వాదము ఉంటుందని చెప్పినవాడు …..

          హర హర మహాదేవ శంభో శంకరా!!!!……..

  
                                  భోళా శంకరా 
                                           భక్త వత్సలా!!!!.......

భోగి

                                       🌾🌻🌞  భోగి 🌞🌻🌾 ‣ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండు...